తెలంగాణ

TG: సంచలనం.. కేయూ లా పరీక్షల్లో మాస్ కాపీయింగ్ రచ్చ!

TG: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సాగుతున్న లా పరీక్షల్లో వెలుగుచూసిన మాస్ కాపీయింగ్ బాగోతం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. సమాజానికి న్యాయాన్ని నేర్పించి, చట్టాన్ని కాపాడాల్సిన కాబోయే న్యాయవాదులే పరీక్ష హాల్స్‌లో అడ్డదారులు తొక్కుతూ పట్టుబడటం విస్మయానికి గురిచేస్తోంది. పకడ్బందీగా జరగాల్సిన పరీక్షల్లో జోరుగా సాగుతున్న చూచిరాతలు కేయూ పరువును బజారున పడేస్తున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కేయూ మహిళా ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంలో ఇటీవల ఓ విద్యార్థిని కాపీ కొడుతూ అడ్డంగా ఇన్విజిలేటర్‌కు దొరికిపోయింది. ఆ తర్వాత ఆమె చేసిన పని మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆన్సర్ షీట్‌ను లాక్కొని ఏకంగా పరీక్ష హాల్ నుంచే ఉడాయించింది.