తెలంగాణ

TG : వర్షాలపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి : పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

TG : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండు రోజుల్లో కనీవినీ ఎరుగని రీతిలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తం అయ్యింది. రాబోయే 48 గంటలు అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షేత్రస్థాయి పరిస్థితులపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల ముప్పు ఎక్కువగా పొంచి ఉన్న పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగాన్ని అత్యంత అప్రమత్తంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు సహాయక చర్యలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.