పంచాయతీల్లో చెక్ పవర్ పై ప్రభుత్వం కీలక ఆదేశాలు
TG: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగం, బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలకు పరిష్కారం చూపుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు (డీపీఓలకు) స్పష్టమైన మార్గదర్శకాలు అందాయి. సర్పంచ్, ఉప సర్పంచ్ల మధ్య అంతర్గత వివాదాల వల్ల పల్లెల్లో అభివృద్ధి పనులు నిలిచిపోకుండా, చెక్కుల జారీ సజావుగా సాగేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.గ్రామాల్లో అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుల కోసం ఇచ్చే చెక్కులపై సంతకాలు చేయకుండా ఉప సర్పంచ్‌లు కావాలని కాలయాపన చేస్తే ఇకపై చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. నిర్దిష్టమైన, సరైన కారణం లేకుండా ఏడు రోజులకు మించి సంతకాలు చేయకుండా లేట్ చేస్తే, జిల్లా కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టాల్సి ఉంటుంది. ఆ జాప్యం ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు నిర్ధారణ అయితే, చట్ట ప్రకారం ఉప సర్పంచ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటారు.
