తెలంగాణ

ఉచిత బస్సు పథకం.. మహిళలకు మేలా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు శాపమా!?..

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల్లో చర్చకు తెరతీసింది. మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ప్రభుత్వానికి సుమారు రూ.12 వేల కోట్ల వరకు ఖర్చవుతోందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. ఒకవైపు ఉద్యోగాలకు వెళ్లే మహిళలు, విద్యార్థినులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, వ్యాపారాలు, ఆసుపత్రులు, ఇతర పనుల కోసం వెళ్లే కోట్లాది మంది మహిళలకు ఇది ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తోంది. అయితే ఎన్నికలకు ముందు ప్రజలను ఆకర్షించే ఉచిత పథకాలు ప్రకటించడం సులభమే. కానీ వాటి ఖర్చు మాత్రం ఆ ఒక్క ఎలక్షన్ తో ముగియదు. ప్రభుత్వం మారినా.. పథకాలు కొనసాగాల్సి వస్తే భవిష్యత్ బడ్జెట్‌పై భారం పడుతుంది. అప్పులు పెరగడం, అభివృద్ధి పనులకు నిధులు తగ్గడం, అవసరమైన మౌలిక వసతులపై పెట్టుబడులు వాయిదా పడటం, రాబోయే తరాల భవిష్యత్తు పై ఈ ఫలితాలు పడటం వంటి నష్టాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.