తెలంగాణ ఎక్సైజ్ శాఖలో 'లిక్కర్' గోల్మాల్.. ఆ లెక్కలన్నీ బయటకు తీస్తున్నారా?
Telangana Excise Department: ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపించే తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ఇప్పుడు అసలు సిసలైన లెక్కల వేట మొదలైంది. అక్రమ మద్యం రవాణాను అడ్డుకోవాల్సిన కొందరు అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపి, పట్టుబడిన సరుకులో చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఆ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ముఖ్యంగా బాటిళ్ల లెక్కల్లో మాయాజాలం, ముడుపుల వాటాల వ్యవహారం ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) దృష్టికి వెళ్లడంతో, ఇప్పుడు ఆ గుట్టుమట్లన్నీ బయటకు తీసే పనిలో ఉన్నతాధికారులు బిజీగా ఉన్నారు.కొందరు అధికారుల అవినీతి వ్యవహారాలపై సీఎంఓ నుంచి నేరుగా వివరణ కోరుతూ ప్రశ్నలు ఎదురవుతుండటంతో ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు కొందరు చేస్తున్న తప్పులకు తాను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
