తెలంగాణ

TG: తెలంగాణపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఎకరానికి రూ.10 వేల సాయం దిశగా సర్కార్!

TG: ఆకాశం వైపు కళ్లప్పగించి చూసిన రైతు కంట ఇప్పుడు కన్నీరే మిగిలింది. వరుణుడు ముఖం చాటేయడం, దానికితోడు ఎల్‌నినో ప్రభావం తోడవడంతో తెలంగాణ పల్లెల్లో కరవు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతికందే దశలో పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11.18 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికార యంత్రాంగం తేల్చింది. ఈ కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి.ఈ వానాకాలం సీజన్‌లో వానలు సరిగ్గా పడకపోవడంతో పత్తి రైతులు నిండా మునిగిపోయారు. దెబ్బతిన్న మొత్తం 11.18 లక్షల ఎకరాల్లో ఏకంగా 8.93 లక్షల ఎకరాలు పత్తి పంటదే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అంటే పాడైపోయిన పంటల్లో దాదాపు 80 శాతం పత్తే. మరో 3 లక్షల ఎకరాలకు పైగా చేలు వాడిపోతుండగా, దాదాపు 80 వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయి బూడిదయ్యాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అత్యధికంగా 3.59 లక్షల ఎకరాల్లో చేలు ఎండిపోగా, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ అన్నదాతలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అసలు పోయిన ఏడాదితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణమే భారీగా తగ్గిపోగా, అందులోనూ వరి నాట్లు ఏకంగా 18 శాతం పడిపోయాయి.