తెలంగాణ

TG: బాధేస్తోంది.. తెలంగాణలో కరవు విలయంపై కవిత తీవ్ర ఆవేదన!

TG: తెలంగాణ గడ్డపై పచ్చని పైర్లు నెర్రెలు బారుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నానని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు కష్టపడి వేసిన పంటలు నీళ్లందక కళ్లెదుటే మాడిపోతుంటే కాంగ్రెస్ పెద్దలు మాత్రం పట్టింపులేనట్లు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. క్షేత్రస్థాయిలో నెలకొన్న తీవ్ర కరవు, తాగునీటి సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.పల్లెల్లో రైతులు నీటిబొట్టు కోసం అల్లాడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి వరుణయాగం చేసి చేతులు దులుపుకున్నారని కవిత మండిపడ్డారు. యాగాల పేరిట కాలయాపన చేయడమే తప్ప, ఎండిన పైర్లను కాపాడేందుకు సర్కారు వద్ద ఎలాంటి స్పష్టమైన కార్యాచరణ లేదని ఎద్దేవా చేశారు. కరవు కోరల్లో చిక్కుకున్న మండలాలను అధికారికంగా గుర్తించి ప్రకటిస్తే కేంద్ర నిధులైనా రైతులకు అందుతాయని, ఆ పని చేయడానికి ప్రభుత్వానికి ఎందుకు మనసొప్పడం లేదని నిలదీశారు.