తెలంగాణ

Double Salary Scam: తెలంగాణలో దొంగ జీతాల బాగోతం.. ఇంత కాలం ఏం చేశారు?

నెల తిరిగేసరికి ఒక్క కొలువు చేసి సంపాదించుకున్న జీతం అందుకోవడానికే సగటు ఉద్యోగి ట్రెజరీ వైపు ఆశగా ఎదురుచూసే రోజులివి. అలాంటిది ఎలాంటి జంకూ గొంకూ లేకుండా, సర్కారు ఖజానానే గుల్ల చేస్తూ ఏకంగా రెండేసి జీతాలు లాగేస్తున్న దొంగ ఉద్యోగుల ముఠా గుట్టు తెలంగాణలో రట్టయింది. ఒకే ఆధార్ కార్డును రెండు వేర్వేరు శాఖల్లో జతచేసి, ఏళ్ల తరబడి రెండు చేతులా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న వైనం సెక్రటేరియట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఉద్యోగుల డేటాను పక్కాగా ఆన్‌లైన్ చేసి ఆధార్‌తో లింక్ చేసే క్రమంలో ప్రభుత్వం నియమించిన అహ్మద్ నదీం కమిటీ పరిశీలనలో ఏకంగా 3,900 మంది ఉద్యోగులు ఈ రకంగా డబుల్ శాలరీలు గుంజుతున్నట్లు తేలడంతో అధికారులు నివ్వెరపోయారు.