Congress vs BRS: అసెంబ్లీ తర్వాత దూకుడు పెంచిన కాంగ్రెస్.. డిఫెన్స్‌లో గులాబీ దళం!
Congress vs BRS: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల ముగింపుతో రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోయాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్పై రాజకీయంగా పైచేయి సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. అసెంబ్లీ వేదికగా మొదలైన రగడను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో హస్తం పార్టీ పూర్తి దూకుడు కనబరుస్తుండగా, ఊహించని ఈ రాజకీయ ఎదురుదాడితో గులాబీ దళం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయినట్లు కనిపిస్తోంది.కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వైఖరి, ఎస్ఐఆర్ వివాదంపై దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలన్నీ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతుంటే, బీఆర్ఎస్ అధిష్ఠానం మాత్రం వ్యూహాత్మక మౌనం దాల్చడం కాంగ్రెస్‌కు బలమైన అస్త్రంగా మారింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు వంటి అగ్రనేతలు ఎస్ఐఆర్పై స్పందించకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఎండగడుతోంది.
