తెలంగాణ

TCongress Incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు ఇన్‌ఛార్జ్ ఉన్నట్టా? లేనట్టా?

TCongress Incharge: తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఓ విచిత్రమైన రాజకీయ సందిగ్ధత నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా, నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న ఆశావహుల నిరీక్షణకు మాత్రం తెరపడటం లేదు. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి మధ్య వారధిగా ఉండే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ పాత్ర అత్యంత కీలకం. అయితే ప్రస్తుతం రాష్ట్ర పార్టీకి ఆ స్థాయి పెద్దదిక్కు ఉన్నారా లేరా అన్న చర్చ గాంధీ భవన్‌లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నెల రోజుల క్రితం ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. ఆమె విదేశాలకు వెళ్లి ఇంతకాలమైనా అధిష్టానం ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయకపోవడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. ఆమె విదేశాల్లో ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాలను అక్కడి నుంచే పర్యవేక్షించే వెసులుబాటును అధిష్టానం ఇచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.