తెలంగాణ

TG: నేనే కాబోయే సీఎం.. కాదు నేనే.. అప్పుడే కాంగ్రెస్‌‌లో లొల్లి!

TG: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పూర్తి కాలం కూడా గడవకముందే, గాంధీ భవన్‌లో సీఎం కుర్చీ చుట్టూ అంతర్గత లొల్లి తారాస్థాయికి చేరింది. పాలనను పరుగులు పెట్టించాల్సిన కీలక సమయంలో, ప్రజా సమస్యల పరిష్కారం కంటే వచ్చే 2029 ఎన్నికల్లో సీఎం ఎవరు అవుతారనే చర్చే కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య జోరుగా నడుస్తుండటం రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. రేవంత్ రెడ్డే సీఎం పీఠం ఎక్కగాలేనిది, పార్టీని ఎన్నో ఏళ్లుగా మోస్తున్న మేమెందుకు కాకూడదన్న అంతర్గత ఈగో ఇప్పుడు బహిరంగ ప్రకటనల రూపంలో బయటపడుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇటీవల కాలంలో ఒకరి తర్వాత ఒకరుగా కాంగ్రెస్ కీలక నేతలంతా తామే కాబోయే సీఎంలమంటూ ఓపెన్‌గా క్లెయిమ్ చేసుకోవడం మొదలుపెట్టారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇప్పటికే తమ మనసులోని కోరికను బయటపెట్టగా, ఎమ్మెల్సీ జగ్గారెడ్డి, యువ నేత బల్మూరి వెంకట్‌, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి సైతం సీఎం రేసులో తామూ ఉన్నామంటూ ఎవరికి వారు కర్చీఫ్‌లు వేసుకుంటున్నారు.