తెలంగాణ

కాంగ్రెస్ ట్రాప్‌లో పడుతున్న బీఆర్ఎస్‌.. ఇమేజ్ డ్యామేజ్ తప్పదా..?

TG: తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా దూకుడు ప్రదర్శించాల్సిన బీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ విసిరిన ట్రాప్‌లో చిక్కుకుపోయిందా? అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై సర్కార్‌ను ఇరుకున పెట్టాలని భావించిన గులాబీ నేతలు.. ఇప్పుడు అధికార పార్టీ సంధించిన భూ ఆరోపణల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రజాక్షేత్రంలో లేవనెత్తాల్సిన కీలక అంశాలను పక్కనపెట్టి, తమ ఆస్తులను కాపాడుకోవడానికి, భూ ఆరోపణలను సమర్థించుకోవడానికే సమయం కేటాయిస్తుండటంతో ప్రజాక్షేత్రంలో బీఆర్‌ఎస్ గ్రాఫ్ మరింత పడిపోతోందన్న విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.వాస్తవానికి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన 22ఏ భూముల సమస్యతో పాటు పాలిటెక్నిక్ విద్యార్థుల ఇబ్బందులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్‌ఎస్ పక్కా ప్లాన్ చేసింది. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి మాత్రం సీన్ రివర్స్ అయింది. గులాబీ పార్టీ ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని అధికార పక్షం సంధించిన భూ ఆరోపణలు బీఆర్ఎస్ శిబిరాన్ని పూర్తిగా ఆత్మరక్షణలో పడేశాయి.