Telangana BJP : తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ vs బీఆర్ఎస్ వార్.. పత్తాలేని బీజేపీ లీడర్లు!
Telangana BJP : తెలంగాణ అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య సాగిన మాటల యుద్ధం రాష్ట్రాన్ని కుదిపేసింది. సభ లోపల, బయట ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు, పోటాపోటీ సవాళ్లు ప్రజాక్షేత్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి. రేవంత్ వర్సెస్ గులాబీ నాయకులు అన్నట్లుగా సాగిన ఈ హై-వోల్టేజ్ పొలిటికల్ డ్రామాతో రాష్ట్రంలోని ప్రధాన వార్తలన్నీ ఈ రెండు పార్టీల చుట్టూనే తిరిగాయి. అయితే తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అని నిత్యం గళమెత్తే బీజేపీ పార్టీ మాత్రం ఈ హోరాహోరీ పోరులో కనీసం కనిపించకుండా సైడ్ అయిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి మీడియా ఫోకస్‌ను, ప్రజల దృష్టిని పూర్తిగా తమవైపే తిప్పుకున్నాయి. ప్రజా సమస్యలపై రచ్చ లేపడం, పరస్పర విమర్శలతో మైలేజ్ సాధించడంలో ఈ రెండు పార్టీలు దూకుడు ప్రదర్శించాయి. కానీ జనాల సమస్యలపై సర్కార్‌ను గట్టిగా నిలదీసి తన బలాన్ని నిరూపించుకోవాల్సిన బీజేపీ శాసనసభాపక్షం మాత్రం ఈ సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది.
