BJP: తెలంగాణ బీజేపీ బాధ్యతలు సునీల్ భన్సల్‌కు.. తెరవెనక బెంగాల్ వ్యూహం?
BJP: దక్షిణాదిలో అధికార పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అధిష్ఠానం, తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలకు తెరలేపింది. ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంలో అపర చాణక్యుడిగా పేరుగాంచిన పార్టీ సీనియర్ నేత సునీల్ భన్సల్‌కు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించడం వెనుక ఢిల్లీ పెద్దల భారీ వ్యూహం దాగి ఉందనే చర్చ స్టార్ట్ అయ్యింది. పశ్చిమ బెంగాల్లో దాదాపు ఉనికి లేని స్థితి నుంచి పార్టీని విజయతీరాలకు చేర్చి, సంచలన ఫలితాలు రాబట్టిన భన్సల్ అనుభవాన్ని ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉపయోగించుకునేందుకు కమలనాథులు రెడీ అయ్యారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ అగ్రనాయకత్వం పక్కాగా ఫిక్స్ అయింది. గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అధికార పార్టీకి చమటలు పట్టించి, గ్రౌండ్ లెవల్లో పార్టీ కేడర్‌ను ఎన్నికల యంత్రంలా మార్చడంలో సునీల్ భన్సల్ అనుసరించిన శైలి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
