తెలంగాణ

Telangana BJP: ఎవరి దారి వారిదే.. అసెంబ్లీ సాక్షిగా బీజేఎల్ పీలో ఏం జరిగింది?

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించేందుకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్‌ను బీజేపీ శాసనసభ్యులు చేజేతులా జారవిడుచుకున్నారన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. సమావేశాల ఆరంభంలోనే బీఆర్‌ఎస్ సభ్యులు సస్పెండ్ కావడంతో, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసి ప్రజల్లో బలమైన ముద్ర వేసే అద్భుతమైన అవకాశం కాషాయ దళానికి దక్కింది. అయితే ఆ అవకాశాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వాడాల్సింది పోయి, అంతర్గత కుమ్ములాటలు, వ్యక్తిగత ఇగోలకే పరిమితం చేశారన్న విమర్శలు ఇప్పుడు సొంత గూటి నుంచే వెల్లువెత్తుతున్నాయి.ఈ సెషన్‌లో అత్యంత సంచలనంగా మారిన అంశం శాసనసభా ప్రాంగణంలోని బీజేఎల్‌పీ కార్యాలయంలో జరిగిన తీవ్ర వాగ్వాదం. స్వల్పకాలిక చర్చల్లో పార్టీ తరఫున మాట్లాడే అవకాశం ఎవరికి దక్కాలనే దానిపై సభ్యులు పరస్పరం కేకలు వేసుకునే స్థాయికి వివాదం వెళ్లిందని సమాచారం.ప్రత్యేకించి శాంతిభద్రతల అంశంపై తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యే అగ్గిమీద గుగ్గిలమైనట్లు తెలిసింది. అసెంబ్లీ కారిడార్‌లోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నేరుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే ఫోన్ చేసి ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు టాక్. చివరికి ఆయనను బుజ్జగించేందుకు స్పీకర్‌ను కోరి మరీ మాట్లాడే వెసులుబాటు కల్పించాల్సి వచ్చిందంటే అసమ్మతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చనే కామెంట్స్ విపిస్తున్నాయి.