ఎవరి గ్రూపులో ఉండాలో తెలియక తలపట్టుకుంటున్న కేడర్.. మెదక్ బీజేపీలో పీక్స్‌కు చేరిన లొల్లి!
Telangana BJP: రాష్ట్రంలో అధికారం మాదేనంటూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రచారం చేసుకుంటున్న బీజేపీ పార్టీ పరిస్థితి మెదక్ జిల్లాలో మాత్రం విడ్డూరంగా మారింది. రెండు నియోజకవర్గాలు.. పది గ్రూపులు అన్న చందంగా మారిన కాషాయ దళంలో ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఒకే నియోజకవర్గంలో, అదీ ఒకే ఊళ్లో ఒకే పార్టీకి ఏకంగా రెండు ఆఫీస్‌లు వెలవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. నర్సాపూర్ కేంద్రంగా జరుగుతున్న ఈ వర్గ పోరు పార్టీ కేడర్‌ను నవ్వులపాలు చేస్తుండగా, అధిష్ఠానం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన వాల్దాస్ మల్లేష్ గౌడ్‌ను నియమించిన నాటి నుంచే అసలు వివాదం స్టార్ట్ అయ్యిందని అంటున్నారు. ఆయన నియామకాన్ని స్థానిక సీనియర్ నేత మురళీ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. మల్లేష్ గౌడ్ నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేక పార్టీ కార్యక్రమాలకు మురళీ యాదవ్ దూరంగా ఉంటూ వచ్చారు. జిల్లా అధ్యక్షుడైన మల్లేష్ గౌడ్ సైతం "వస్తే రండి.. లేకపోతే పొండి" అన్న రీతిలో వ్యవహరించడంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరిందని చెబుతున్నారు.
