తెలంగాణ

Telangana BJP: తెలంగాణ నేతలపై అధిష్టానం ఆగ్రహం.. పనితీరు మార్చుకుంటారా?

Telangana BJP: తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నేతల వ్యవహారశైలి తీవ్ర అసహనాన్ని తెప్పిస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన వరుస కీలక భేటీల్లో అధిష్టానం దూత సునీల్ బన్సల్ స్వరం తీవ్రంగా మారింది. పార్టీ పదవులను అలంకారప్రాయంగా వాడుకుంటూ, కేవలం ఏసీ గదులకే పరిమితమైన నేతల వైఖరిపై ఢిల్లీ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న సంకేతాలు ఈ సమావేశంతో స్పష్టమయ్యాయి. పార్టీని ముందుకు నడిపించే సత్తా లేని వారికి కీలక బాధ్యతల్లో కొనసాగే అర్హత లేదని బన్సల్ ముఖం మీదే స్పష్టం చేయడం రాష్ట్ర నాయకత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది.ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాల్సిన సమయంలో, నాయకులు అంతర్గత రాజకీయాలకే ప్రాధాన్యమిస్తుండటంపై కేంద్రం అసంతృప్తితో ఉంది. కేవలం పదవులను అనుభవించడం తప్ప, పార్టీ ఇచ్చిన బాధ్యతలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందుతున్న వారి జాబితా అధిష్టానం వద్ద ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.