తెలంగాణ

TBJP: ‘అభ్యర్థి కావలెను’ తెలంగాణ బీజేపీలో విచిత్ర రాజకీయం!

TBJP: తెలంగాణ బీజేపీ పార్టీలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది స్టార్టింగ్‌లో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాషాయ శిబిరంలో ఒకవైపు విపరీతమైన పోటీ (అతివృష్టి), మరోవైపు కనీసం బరిలో నిలబడేందుకు నాయకులే ముందుకు రాని పరిస్థితి (అనావృష్టి) పార్టీ నాయకత్వాన్ని తలపట్టుకునేలా చేస్తోంది. రెండు నియోజకవర్గాల్లో పార్టీ ఎదుర్కొంటున్న ఈ పరస్పర విరుద్ధ పరిస్థితులు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం బీజేపీలో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో టికెట్ కోసం ఏకంగా 28 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నట్లు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. కొందరు నేతలు తమకే టికెట్ ఖాయమన్న ధీమాతో గ్రౌండ్‌ లెవల్‌లో ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. సంస్థాగత బలం, అర్బన్ ఓటర్ల మద్దతు పుష్కలంగా ఉండటంతో ఇక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువని భావించి నేతలంతా టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.