TG: భట్టి క్యాంప్ ఆఫీసులపై రచ్చ! ఖజానా ఖాళీ అంటూనే జీవోలు..
TG: రాష్ట్రంలో ఖజానా మొత్తం ఖాళీగా ఉందని, గత పాలకుల వల్లే నిధుల కొరత ఏర్పడిందని పదేపదే చెబుతున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. తన క్యాంప్ ఆఫీసుల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరిస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే సకల సౌకర్యాలున్న ‘ప్రజాభవన్’ అధికారిక నివాసంగా ఉండగా.. సొంత నియోజకవర్గమైన మధిర, అటు ఖమ్మం కేంద్రంగా వరుస భవనాల రినోవేషన్లు, నిర్మాణాల పేరుతో జీవోల మీద జీవోలు విడుదల చేయడం ఇప్పుడు విమర్శల పాలవుతోంది.మధిరలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ ఆధునీకరణ కోసం దాదాపు రూ. 1.50 కోట్లు కేటాయించినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అందులో భాగంగా ఆఫీస్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం, పీఏ గది, కలరింగ్ కోసం రూ. 40.81 లక్షల విలువైన టెండర్‌ను 'ఆర్ ఎన్ కన్స్ట్రక్షన్స్'కు ఇచ్చినట్లు వివరాలు ప్రచారంలోకి వచ్చాయి.
