తెలంగాణ

సూర్యాపేట కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. బ్యాంకు మేనేజర్ అరెస్టు

కలెక్టర్ సంతకం ఫోర్జరీకి పాల్పడి ఆర్థిక అవకతవకలకు తెరలేపిన బ్యాంకు మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా జిల్లా పాలనాధికారి సంతకం ఫోర్జరీ చేయడం అంటే మాములు విషయం కాదు. జిల్లా మొత్తానికి ఆయన జవాబుదారి. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం మంజూరు చేసే నిధులు ఆయన సంతకం ద్వారానే విడుదల అవుతాయి. అలాంటిది ఆయన సంతకం ఫోర్జరీ కావడంతో కలెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ ఘటన ఈనెల 15 జరగగా..ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సంతకాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజర్ కోడూరు రఘు ప్రసాద్ ఫోర్జరీ చేసినట్టు తెలిసింది.