ఏపీ

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. ఝలక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

బీసీ రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన తీర్పు వెలువరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు కల్పించిన 34 శాతం రిజర్వేషన్ల జీవోలను రద్దు చేస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సరైనదే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్‌ను దేశఅత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయస్థానంలో వాడీవేడిగా వాదనలు జరిగాయి. క్షేత్రస్థాయి జనాభా లెక్కలు, ఎంపిరికల్ డేటా ఆధారంగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని, స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కలుగజేసుకున్న ధర్మాసనం.. రాజ్యాంగబద్ధమైన 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్‌ను అస్సలు దాట కూడదని తేల్చి చెప్పింది.