National

దుర్గా పూజలో తొక్కిసలాట.. 17 మంది దుర్మరణం!

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నవరాత్రుల సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నార్త్ కోల్‌కతాలోని ప్రసిద్ధ చోర్‌బాగన్ సార్వజనీన్ దుర్గాపూజా పండల్ వద్ద శనివారం రాత్రి అనుకోకుండా తొక్కిసలాట నెలకొంది. ఈ ప్రమాదంలో కనీసం 17 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 25 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. దుర్గమాత దర్శనం కోసం వేలాది మంది భక్తులు పోటెత్తిన సమయంలో అకస్మికంగా భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు తలదాచుకునేందుకు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ క్రమంలోనే అక్కడ తీవ్ర తోపులాట జరిగినట్టు సమాచారం. తోపులాట కారణంగా కొందరు మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు కిందపడిపోయినట్టు తెలిసింది. అదే సమయంలో చాలా మంది పరుగులు తీయగా కింద పడిపోయిన వారిని తొక్కుకుంటూ జనాలు ముందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది.