క్రీడలు

SPORTS : ఐసీసీ చైర్మన్‌గా జై షా.. రెండోసారి ఏకగ్రీవం

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఛైర్మన్‌గా జై షా (Jai Shah) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇండోనేషియా దేశంలోని బాలిలో సోమవారం నిర్వహించిన ఐసీసీ బోర్డు సమావేశాల్లో డైరెక్టర్లు జై షా పేరును ప్రతిపాదించగా, ఎటువంటి పోటీ లేకుండా ఆయనను రెండోసారి ఛైర్మన్‌గా బోర్డు ఎంపిక చేసింది. క్రికెట్‌ను అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడం, గేమ్‌కు అభిమానుల నుంచి ఆదరణ పెంచడం, వాణిజ్యపరమైన వృద్ధిని సాధించే కీలక సమయంలో జై షా లీడర్ షిప్ ఎంతో అవసరమని ఐసీసీ బోర్డు భావించినట్టు తెలిసింది. రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా ఎన్నిక కావడంపై జై షా స్పందించారు. తనపై ఐసీసీ బోర్డు ఉంచిన నమ్మకానికి, డైరెక్టర్ల నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘ఐసీసీ ఛైర్మన్‌గా సేవలందించడం ఒక గౌరవంతో పాటు పెద్ద బాధ్యత. అంతర్జాతీయంగా క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి నేను కట్టుబడి ఉన్నా. ఆటగాళ్లు, అభిమానులు, వాణిజ్య భాగస్వాముల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని క్రికెట్‌కు బలమైన, సుస్థిరమైన భవిష్యత్‌ను నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.