Spirituality
మరణించిన పితృ దేవతలకు తర్పణాలు ఎందుకు!..
సనాతన ధర్మంలో తల్లిదండ్రులకు, పూర్వీకులకు అత్యున్నతమైన స్థానం ఉంది. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెప్పడమే కాకుండా, వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా వారితో మనకున్న అనుబంధం తెగిపోదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అదే పితృ తర్పణాల విశిష్టత.. ఇక తర్పణం అంటే తృప్తిపరచడం. మన రక్తసంబంధీకులు, మన వంశకర్తలు పితృలోకంలో ఉన్నప్పుడు, వారికి నీరు, నువ్వులతో అర్పించే అంజలినే తర్పణం అంటాం. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే... మనిషి శరీరం నశిస్తుంది కానీ ఆత్మ అమరం. శరీరాన్ని వదిలిన ఆత్మ తన పూర్వ కర్మల ఆధారంగా ముందుకు సాగుతుంది. ఆ ప్రయాణంలో వారికి కావలసిన సూక్ష్మ శక్తినీ, శాంతినీ మన భక్తిపూర్వకమైన తర్పణాలు అందిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి..
