Spirituality

మానవుడు మట్టి కుండతో సమానం అంటారు ఎందుకు?..

మనిషి జీవితం నీటిలో బుడగ వంటిది. శరీరం మట్టి కుండతో సమానం అని పోల్చుతారు.. వేదాంతపరమైన ఈ వ్యాఖ్యలు అంతసులువుగా అందరికీ అర్థం కావు. కానీ ఆథ్యాత్మిక పరంగా ఎంతో లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయని మన పండితులు చెబుతారు. ఇక మట్టిని నీటితో కలిపి, ఆకారం ఇచ్చి, అగ్నిలో కాల్చితే కుండ తయారవుతుంది. మనిషి శరీరం కూడా ప్రకృతి అనే మహాశక్తి చేతిలో అలా రూపుదిద్దుకున్నదేనని మన సనాతన ధర్మం చెబుతుంది. ఉపనిషత్తులలో మానవ శరీరాన్ని పంచభూతాల సమాహారంగా వివరించారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం... ఈ ఐదు తత్త్వాలే శరీర నిర్మాణానికి ఆధారమని గర్భోపనిషత్ వివరిస్తుంది. శరీరంలో గట్టిగా ఉన్నది భూమి తత్త్వం, ద్రవంగా ఉన్నది జల తత్త్వం, వేడిమి అగ్ని తత్త్వం, కదలిక వాయు తత్త్వం, ఖాళీ ప్రదేశాలు ఆకాశ తత్త్వానికి ప్రతిరూపాలని చెప్పబడింది.