Spirituality

పరమేశ్వరుని తత్త్వం మనిషికి ఏం నేర్పుతుంది?

శివుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు అనే పదాలు రూపం లేని ఆ పరంజ్యోతికి లయకారకుడైన మహాదేవుడిలోని వేర్వేరు భక్తి భావాలను తెలియజేస్తాయి. శివుడు అంటే అత్యంత మంగళకరమైనవాడని.. ఈశ్వరుడు అంటే సమస్త విశ్వాన్ని పరిపాలించే సర్వశక్తిమంతుడని.. పరమేశ్వరుడు అంటే దేవతలకు కూడా దేవుడైన మహాదేవుడని ఆథ్యాత్మిక గ్రంధాలు బోధిస్తాయి.. త్రినేత్రుడిగా పిలవబడుతున్న ఆ శ్మశాన నివాసి జీవితం ఎంతో లోతైన తత్వాన్ని తెలియజేస్తుంది. జ్ఞానులు మాత్రమే దర్శించగలిగే అంత నిగూఢమైన సత్యం ఆయన ప్రతి రూపంలోనూ దాగుంది. శరీరానికి బూడిద పూసుకునే దిగంబరుడు... సమస్త బంధాలు, భౌతిక వ్యామోహాలు తాత్కాలికమేనని గుర్తుచేస్తాడు. కాళకూట విషాన్ని గొంతులో దాచిన నీలకంఠుడు... లోక కళ్యాణం కోసం త్యాగానికి ప్రతిరూపంగా నిలుస్తాడు. అలాగే సృష్టి, స్థితి, లయలను తనలో ఇముడ్చుకున్న ఆ ఈశ్వర తత్త్వం మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో గొప్ప సత్యాలను తెలియచేస్తుంది.