Sonia Gandhi: ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నిర్ణయం తప్పే.. సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు
Sonia Gandhi: భారత రాజకీయ యవనికపై ఇప్పటికీ చెరగని మచ్చగా మిగిలిపోయిన 'ఎమర్జెన్సీ' వ్యవహారంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారిగా నోరు విప్పారు. తన అత్తగారు, నాటి ప్రధాని ఇందిరా గాంధీ తీసుకున్న ఆ వివాదాస్పద నిర్ణయం ముమ్మాటికీ "ఓ చారిత్రక పొరపాటే" అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా.. దేశాన్ని అతలాకుతలం చేసిన ఆ అంధకార కాలానికి తెరవెనుక అసలు సూత్రధారి ఎవరు? గాంధీ కుటుంబంలో డిన్నర్ టేబుల్ వద్ద నడిచిన తీవ్ర ఘర్షణలేంటి? అనే విస్తుపోయే రహస్యాలను ఆమె బహిర్గతం చేశారు. త్వరలో రాబోతున్న తన ఆత్మకథ నేపథ్యంలో ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో పాటు 'ది హిందూ' పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సోనియా గాంధీ ఈ నిజాలను బయటపెట్టారు.ఎమర్జెన్సీ విధించే అంశంపై నాటి గాంధీ కుటుంబంలో తీవ్రస్థాయిలో వాగ్వాదాలు, అంతర్గత కుమ్ములాటలు జరిగాయని సోనియా స్పష్టం చేశారు. ఈ కఠిన నిర్ణయాన్ని రాజీవ్ గాంధీ ఆది నుంచే తీవ్రంగా వ్యతిరేకించారని ఆమె గుర్తు చేసుకున్నారు. "వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఓపిక పట్టండి.. తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు" అని రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరకు పదేపదే మొరపెట్టుకున్నారు. అయితే ఇందిర చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మాత్రం ఎమర్జెన్సీ విధించాల్సిందేనని మొండిపట్టు పట్టారు.
