తెలంగాణ

ఇందిరా, రాజీవ్ అని పేర్లు పెడితే చాలదు.. పథకాల అమలేది? : హరీశ్ రావు

ప్రభుత్వ పథకాలకు మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అని పేర్లు పెడితే చాలదని, వాటిని అమలు చేయాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. ఆ హామీలను నెరవేర్చినప్పుడే వారికి నిజమైన గౌరవమని పేర్కొన్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాహుల్.. రేవంత్ సర్కార్ మూడు బడ్జెట్ల వైఫల్యాలపై సమీక్ష నిర్వహించి లెక్క అడగాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ వేదికగా సంచలన పోస్టు పెట్టారు. నిరుపేద కూలీలు,నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. అమలుకు నోచుకోని పథకాలకు ఆ మహనీయుల పేర్లు పెట్టి ప్రజలను మోసం చేయడం వారిని అవమానించడమే అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ మూడు బడ్జెట్ల ఫార్ములా చాలా సింపుల్ గా ఉందని, హామీలు ప్రకటించడం, పాత ప్రకటనలనే మళ్లీ కొత్త బడ్జెట్‌లో తిరగబోయడం అని చెప్పారు. చివరకు పైసా ఇవ్వకుండా ఎగ్గొట్టడం బాగా అలవాటు అయ్యిందన్నారు.