ధాన్యం అక్రమాలకు చెక్.. రంగంలోకి 'SHT'
SHT Strategy: తెలంగాణలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల వేళ ఏటా తెరపైకి వచ్చే దళారుల దందా, ధాన్యం రీసైక్లింగ్, నకిలీ రశీదుల అక్రమాలకు శాశ్వత బ్రేక్ వేసేందుకు పౌర సరఫరాల శాఖ అత్యంత కఠినమైన యాక్షన్ ప్లాన్ను రెడీ చేసింది. 2026-27 ఖరీఫ్ సీజన్లో రాష్ట్రాన్ని ముంచెత్తనున్న రికార్డు స్థాయి 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సరికొత్త ‘SHT’ (స్టోరేజ్, హమాలీ, ట్రాన్స్పోర్ట్) అస్త్రాన్ని బయటికి వదిలారు. ప్రతి లారీకి జీపీఎస్ ట్రాకింగ్, మిల్లులపై మెరుపు దాడులకు ప్రత్యేక యాప్, నకిలీ షీట్లకు చెక్ పెట్టేందుకు కఠిన హెచ్చరికలు జారీ చేస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రంగంలోకి దిగారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల (పీపీసీ) నుంచి మిల్లులకు తరలించే క్రమంలో పక్కదారి పట్టడం లేదా కాగితాల్లోనే కొనుగోళ్లు చూపించి అక్రమాలకు పాల్పడటం గతంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈసారి అటువంటి తప్పిదాలకు ఏమాత్రం తావులేకుండా ప్రతి వాహనానికి తప్పనిసరిగా 'జీపీఎస్' ట్రాకింగ్ సిస్టమ్ అమర్చాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఏ లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో క్షణక్షణం మానిటర్ చేయనున్నారు. అంతేకాకుండా, అధికారులు మిల్లుల్లో అకస్మాత్తుగా తనిఖీలు చేయడానికి సరికొత్త 'ఫిజికల్ వెరిఫికేషన్ మొబైల్ యాప్'ను అందుబాటులోకి తెచ్చారు.
