మందుబాబులకు షాక్.. లిక్కర్ ధరలు భారీగా పెంపు!
దసరా పండుగ వేళ మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, లోకల్ బ్రాండ్స్, బీర్ల ధరలను టచ్ చేయకుండా కేవలం విదేశాల నుంచి దిగుమతి అయ్యే ప్రముఖ బ్రాండ్స్ స్కాచ్, సింగిల్ మాల్ట్ విస్కీలు, వోడ్కా, జిన్, టేకిలా, వైన్ రకాల గరిష్ఠ రిటైల్ ధరలను సవరించింది. ఈ మేరకు బుధవారం అబ్కారీ శాఖ నూతన ధరల జాబితాను విడుదల చేసింది.సవరించిన ధరల ప్రకారం పలు టాప్ బ్రాండ్ల మద్యం సీసాల రేట్లు భారీగా పెరిగాయి.ఇదిలాఉండగా, వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు సవరించిన నూతన ఎంఆర్పీ (MRP) ధరలకే మద్యం విక్రయించాలని తెలంగాణ అబ్కారీ శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. నిర్ణయించిన ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయించినా, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్టు తమ దృష్టికి వస్తే షాపుల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అబ్కారీ శాఖ అధికారులు హెచ్చరించారు.
