మురుగు నీరే పంటలకు సాగు నీరైంది..!
రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆగం అవుతున్నారు. చేతికొచ్చిన పంట నీరు లేక ఎండిపోతుండటంతో ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. దీంతో మురుగు నీటిని మోటార్లు పెట్టి మరీ పొలాలకు మళ్లిస్తున్నారు. అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం మరింత దయనీయంగా తయారైంది. ఓ వైపు వర్షాలు లేక ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అల్లాడుతున్నారు. పంట కోతకు రాకముందే ఎండిపోతుండటంతో పెట్టుబడి కూడా రావడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. రాష్ట్రంలో నదులు పారుతున్నా పంటలకు నీళ్లివ్వలేని దుస్థితి నెలకొందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగు నీటి కష్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే జిల్లా నుంచి కృష్ణా, తుంగభద్ర నదులున్నా పారుతున్నా పంటలకు నీరు అందడం లేదని, తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా రైతులకు సైతం నీళ్లివ్వకుండా గోస పెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
