మంత్రి పొంగులేటి కమీషన్ దందా : ఆర్ఎస్పీ
రాష్ట్రంలో 22 ఏ నిషేధిత జాబితా గురించి వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్.. అధికార కాంగ్రెస్ పార్టీ మీద మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది. కమీషన్ల కోసమే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలోని భూములను నిషేధిత జాబితాలో పెట్టించారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 22 A ద్వారా భూములను నిషేధిత జాబితాలో పెట్టి, సిగ్గులేకుండా టోల్‌ఫ్రీ నంబర్ పెట్టామని చెప్తున్నాడు. టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే బాధితుల నంబర్లు తీసుకుని, ఒక వారం రోజులకు వాళ్లకు బ్రోకర్ గాళ్లు ఫోన్ చేస్తారు. నీకున్న భూమిలో కొంత మాకు రాసిస్తే, నీ భూమిని నిషేధిత జాబితా నుంచి తీసేస్తామని చెప్తారు. ప్రభుత్వ అధికారులకు కూడా తెలియకుండానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి ద్వారా మన భూములను వేరే వాళ్ల పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు’అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
