తెలంగాణ

సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసు.. ఎమ్మెల్యే గాంధీకి ఈడీ సమన్లు

సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపింది.సెప్టెంబర్ 27న విచారణకు హాజరు కావాలంటూ గురువారం పంపిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ప్రీ లాంచ్ పేరుతో కస్టమర్లను మోసం చేసిన సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే.ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ బ్యాంక్ ఖాతాల ద్వారా సాహితి ఇన్‌ఫ్రా నుంచి రూ.2.1 కోట్లు మళ్లించినట్టు ఆరోపణల రావడంతో దీనిపై ఈడీ విచారణ చేస్తున్నది. లావాదేవీల స్వభావం, ఉద్దేశంపై దర్యాప్తు చేపట్టింది.నిధుల వినియోగానికి సరైన వ్యాపార కారణాలు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తునట్టు తెలిసింది. మనీలాండరింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఆస్తులపైనా ఈడీ దృష్టి సారించింది.