గెస్ట్ హౌస్‌కు రమ్మన్న ఆ పెద్దమనిషి ఎవరు?.. కాంగ్రెస్‌పై RSP ఫైర్!
RS Praveen Kumar: తెలంగాణలో ‘ఎల్ నినో’ తెచ్చిన కరువు కంటే.. రేవంత్ సర్కార్ తెచ్చిన ‘ఎల్ కాంగో’ తెగులు వల్లే రాష్ట్రం అతలాకుతలమవుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతి, శాంతిభద్రతల వైఫల్యాలను ఎండగడుతూ పలు దిగ్భ్రాంతికర అంశాలను బట్టబయలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి సన్నిహితుడికి సంబంధించిన గెస్ట్ హౌస్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ఆయన సంధించిన ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రకటనల కోసం ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితుడిని కలిసిన ఓ మహిళా వ్యాపారవేత్తకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన బయటపెట్టారు. ఆ మహిళను సదరు వ్యక్తి నేరుగా ‘గెస్ట్ హౌస్’కు రమ్మని వేధించాడని, ఈ దారుణాన్ని స్వయంగా బాధితురాలే సోషల్ మీడియా వేదికగా వెల్లడించినా ప్రభుత్వం ఎందుకు కిమ్మనడం లేదని ప్రశ్నించారు. "ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులపైకి పోలీస్ పహారాతో వెళ్లే కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు దమ్ముంటే ఆ గెస్ట్ హౌస్ ఎవరిది? ఆ వివాదాస్పద సన్నిహితుడు ఎవరో తేల్చి ఆ మహిళకు న్యాయం చేయాలి" అని సూటి సవాల్ విసిరారు.
