తెలంగాణ

హైదరాబాద్‌లో వెయ్యి కోట్ల ల్యాండ్ స్కామ్- కాంగ్రెస్ ఎంపీ పై సంచలన ఆరోపణలు

Land Grab: బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ పై సంచలన ఆరోపణలు చేశారు. గచ్చిబౌలిలో గుడిసెలు వేసి.. ఎంపీ బలరాం నాయక్ వెయ్యి కోట్ల ల్యాండ్ స్కామ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు కాపాడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు.. కానీ ఆయన పార్టీ ఎంపీ పోరిక బలరాం నాయక్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్ నడి ఒడ్డున శేరిలింగంపల్లిలోని 4.13 ఎకరాల ఎస్సీలకు చెందిన భూమిని కబ్జా చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.

భూమి విలువ వెయ్యి కోట్లు

ఈ ప్రభుత్వ భూమి విలువ అక్షరాలా 1000 కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి తెలియకుండా ఈ కబ్జా జరగదన్నారు. ఎందుకంటే హైడ్రా, రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీసు శాఖలన్నీ రేవంత్ దగ్గరే ఉన్నాయన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.