రూ. 1,100 కోట్ల అవినీతి..మీ మంత్రులపై చర్యలేవి రేవంత్ రెడ్డి? : శ్రీనివాస్ గౌడ్
అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.రాష్ట్రంలో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు, జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపిస్తున్న ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని, వారి ఆస్తుల మీద తప్పులు ఆరోపణలు చేస్తున్నారని, మరి అధికార పార్టీ మంత్రులు రూ. వందల కోట్లు దోచేస్తున్నా వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్, ఈఎస్ఐ డబ్బులు కాంట్రాక్టర్లు తిన్నారని ప్రభుత్వం వేసిన నిజనిర్దారణ కమిటీ తేల్చిందని మరి వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లను పిలిచి ఓ మంత్రి మీటింగ్ పెట్టారని, వారి నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేశారని.. ఆ నిధులు అన్ని ఎక్కడికి పోయాయని నిలదీశారు. ప్రభుత్వ ఖజానాలో జమ చేశారా? ఎవరి జేబులోకి వెళ్లాయని ప్రశ్నించారు.
