తెలంగాణ
అమెరికాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం నెలకొంది.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఫ్లోరిడా రాష్ట్రంలో వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే కారులోని ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్టు సమాచారం. మృతుల్లో ఒకరు నిజామాబాద్ జిల్లా (నవీపేట)కు చెందిన రాహుల్‌గా గుర్తించారు. ఉన్నత విద్య కోసం సుమారు మూడు నెలల క్రితమే రాహుల్ అమెరికా వెళ్లినట్టు తెలిసింది. ప్రమాదంలో మరణించిన వారి వివరాలను ఫ్లోరిడాలోని స్థానిక అధికారులు వారి కుటుంబాలకు సమాచారం అందించారు. మిగిలిన ఇద్దరు విద్యార్థుల గురించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
