తెలంగాణ

రేవంత్ మాటలు కోటలు.. గడప దాటని విద్యార్థుల భవిష్యత్ : హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ అంధకారం అవుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా సంచలన పోస్టు పెట్టారు. ‘సీఎం రేవంత్ రెడ్డి.. మీ మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ విద్యార్థుల భవిష్యత్ మాత్రం కాలేజీ గడప దాటడం లేదు. రేపటి తెలంగాణను నిర్దేశించాల్సిన యువతను, నేడు సర్టిఫికెట్ల కోసం నడిరోడ్డు మీద నిలబెట్టారు. ప్రతిపక్షాలను తిట్టడం, అసత్యాలు ప్రచారం చేయడం మీద మీకున్న శ్రద్ధ.. ఈ రాష్ట్ర బిడ్డలు పడుతున్న గోస మీద ఎందుకు లేదు? బాధిత విద్యార్థులు నన్ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తి చేసినా... మీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు వారి సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని కన్నీళ్లు పెట్టుకున్నారు’ అని పేర్కొన్నారు.