రేవంత్ దోపిడీ.. వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా జిల్లాల్లో ఆ పార్టీ నేతలు వేడుకలు చేస్తున్నారు. ఈ వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, సాధించిన ఘనతలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు జరపాలని జిల్లా డీసీసీ నేతలకు నిన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలు పంపారు. అయితే, నిన్న రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రేవంత్ సర్కార్ వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా నగగరంలో పోస్టర్లు అంటించడం కలకలం రేపింది. వెయ్యి రోజుల పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ హైదరాబాద్లోని పలు కీలక ప్రాంతాల్లో పోస్టర్లు అంటించడంతో నగరవాసులు జోరుగా చర్చించుకుంటున్నారు. ‘1000 డేస్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్’ అనే శీర్షికతో గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేసినట్టు సమాచారం.TGSMS’ పేరుతో పోస్టర్లు వెలిశాయి.సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ‘ఏఐ’ చిత్రాలను వ్యంగ్యంగా ముద్రించారు. ఓ వైపు నోట్ల కట్టలతో ఉన్న భారీ మూటను సీఎం మోసుకెళ్తుండగా.. మరోవైపు ప్రజలు, యువత ఆవేదనతో చేతులెత్తి సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు, ఆర్తనాదాలు చేస్తున్నట్టు ఆ చిత్రాలు ప్రతిబింబిస్తున్నాయి.
