తెలంగాణ

ఆరోగ్య శ్రీపై రేవంత్ రెడ్డికి కక్ష : హరీశ్ రావు

ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రభుత్వంపై మాజీ మంత్రి, శాసనసభ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మరోసారి మండిపడ్డారు. సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదని, ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందడం లేదని.. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం,సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో హరీశ్ రావు ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలో వైఫల్యం. సిబ్బందికి జీతాలు చెల్లించడంలోనూ వైఫల్యం!.ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష రేవంత్ రెడ్డి’ అంటూ ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆవేదన వింటే గుండె కలిచి వేస్తోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ, ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తూర్పారబట్టారు.