తెలంగాణ

Revanth vs KTR: సీఎం తొలి సిరిసిల్ల పర్యటనపై ఉత్కంఠ.. కేటీఆర్ బహిరంగ లేఖతో రాజ‌కీయ దుమారం!

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్తుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీకి అత్యంత బలమైన కంచుకోటగా భావించే సిరిసిల్ల నియోజకవర్గంలో సీఎం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా సిరిసిల్ల ప‌ట్ట‌ణంతో పాటు పరిసర ప్రాంతాల్లో సుమారు రూ.345 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి సంక్షేమ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటన కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా, రాజకీయ ప‌రంగా పాగా వేసేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.