తెలంగాణ

TG: కేసీఆర్‌ పాలమూరు ప్రజల గుండెల మీద తన్నాడు.. సీఎం రేవంత్‌ ఆగ్రహం

TG: పాలమూరు ఎంపీగా గెలిచి, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఈ నేల రుణం తీర్చుకుంటాడని నమ్మితే.. కేసీఆర్ పాలమూరు ప్రజల గుండెలపై తన్ని గజ్వేల్‌కు పారిపోయాడని సీఎం రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. వికారాబాద్ జిల్లా హకీంపేట్‌లో నిర్వహించిన ‘రైతన్నతో ఆత్మీయ సభ’ వేదికగా బీఆర్‌ఎస్ అధినేతపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు గడ్డ నుంచి పోటీ చేసి కేసీఆర్ సీఎంగా గెలవాలని ఇక్కడి ప్రజలు ఆశపడితే, ఆయన మాత్రం జిల్లాను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు.పాలమూరు బిడ్డల వలసల గోసపై రేవంత్‌రెడ్డి భావోద్వేగంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతం నుంచి ఎందరో మంత్రులు వచ్చినా పాలమూరు నుంచి వలసలు మాత్రం ఆగలేదని, 75 ఏళ్లలో ఈ ప్రాంతానికి న్యాయం చేసిన నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఉద్యమ సమయంలో మక్తల్-నారాయణపేట ప్రాజెక్టును తెరపైకి తెచ్చి, అధికారంలోకి వచ్చాక దాన్ని అటకెక్కించారని కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.