రాజకీయాలు

రేవంత్ రెడ్డి భూ కబ్జాదారుడు : హరీశ్ రావు

రాష్ట్రంలో 22 ఏ నిషేధిత జాబితాలోకి ప్రభుత్వ, ప్రయివేటు భూములను చేర్చడం ద్వారా పట్టాదారులు, అసలైన ఓనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. చాలా మంది తమ బిడ్డల పెళ్లిళ్లు, ఉన్నత చదువుల కోసం భూములు, భవనాలు అమ్ముకుందామని ప్రయత్నిస్తే 22ఏ నిషేధిత జాబితాలో తమ ప్రాపర్టీలు ఉన్నాయని, వాటిని అమ్మడానికి లేదని రిజిస్ట్రార్ అధికారులు చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా 22 ఏ నిషేధిత జాబితాలో తమ ఆస్తులు చేరడం వలన ఇబ్బందులు పడుతున్న బాధితులతో మాజీ మంత్రి హరీశ్ రావు బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాడ్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఓ కబ్జాదారుడు అని ఆరోపించారు. ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ, అసైన్డ్ భూములను లాక్కుంటూ, ప్రజల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన రేవంత్ అసలైన కబ్జాదారుడు అని విమర్శించారు. 22-Aను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కబ్జాదారులు అని రేవంత్ రెడ్డి అంటున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్న ఈ ప్రజలు కబ్జాదారులా? అని నిలదీశారు.