రేవంత్.. సోనియా చెప్పారని ప్రజలను విడగొట్టొద్దు : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
‘పేదోళ్ల దేవుడు శివుడు.. ఉన్నోళ్ల దేవుడు రాముడు’ అందుకే బీజేపీ వాల్లు పదే పదే జై శ్రీరాం అంటారని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో నిర్వహించిన ఓ మీడియా మీట్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. తాము పేదల వైపు ఉంటే బీజేపీ సంపన్నుల వైపు ఉందని వ్యాఖ్యానించారు. గతంలో ‘సైమన్ గో బ్యాక్’ అని నినదించి దేశమంతా ఏకమైనట్టు ఇప్పుడు ‘ఎస్‌ఐఆర్’ గోబ్యాక్ అని నినదిస్తూ దేశమంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు.తాము హరహర మహాదేవ్ అని అంటే బీజేపీకి నచ్చడంలేదని, వారు జై శ్రీరామ్ అనడానికే మొగ్గు చూపుతున్నారన్నారు. శివుడు పేదల దేవుడు,రాముడు ధనికుల దేవుడు అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కౌంటర్ ఇచ్చారు. సోనియా గాంధీ చెప్పారని రేవంత్ రెడ్డి ప్రజలను విడగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని మంచి డాక్టర్‌కు చూపించాలని సెటైర్లు వేశారు. సౌత్, నార్త్ అంటూ రేవంత్ రెడ్డి ప్రజలను విభజిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
