రద్దు చేయడానికి రిజర్వేషన్స్ దానంగా రాలేదు : చిరాగ్ పాశ్వాన్
రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రస్తుతం దేశంలో కొత్త ఉద్యమం పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’ పేరిట సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం.. శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టింది. కులాల వారీగా రిజర్వేషన్లు రద్దు చేసి కేవలం ఆర్థిక ప్రాతిపదికన అమలు చేయాలని రిజర్వేషన్ హటావో ఆందోళన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. వీరికి దేశవ్యాప్తంగా సామాజిక మాద్యమాల్లో మద్దతు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, జంతర్‌మంతర్ 'రిజర్వేషన్ హఠావో' పేరిట ఆందోళనలు చేస్తున్న వారిపట్ల కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రిజర్వేషన్లు ఏమీ దానం కాదని, అవి ఎవరి డిమాండ్ మేరకో రద్దు చేసేది కాదని’ పేర్కొన్నారు. నిన్న పాట్నాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తరతరాలుగా సామాజిక వివక్షను ఎదుర్కొంటున్న వర్గాలకు అండగా నిలిచేందుకే రాజ్యాంగం కల్పించిన హక్కు రిజర్వేషన్ అని గుర్తుచేశారు.
