AP: రాప్తాడులో ఉన్మాదం.. రంపంతో విద్యార్థినిపై దాడి.. ప్రభుత్వం సీరియస్!
AP: బడి గదిలో పిల్లలంతా శ్రద్ధగా పాఠాలు వింటున్నారు. ఇంతలోనే చేతిలో రంపం పట్టుకుని ఓ వ్యక్తి లోపలికి దూసుకొచ్చాడు. కళ్లముందేం జరుగుతోందో టీచర్, తోటి పిల్లలు తెలుసుకునేలోపే.. టెన్త్ క్లాస్ చదువుతున్న ఓ విద్యార్థినిపై విచక్షణ లేకుండా రంపంతో దాడికి దిగాడు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను కలకలం రేపింది.రాప్తాడు హైస్కూల్లో ఎప్పటిలాగే క్లాసులు నడుస్తున్నాయి. పదో తరగతి గదిలో టీచర్ లెక్కల పాఠం చెబుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ యువకుడు మెషీన్ రంపంతో నేరుగా క్లాస్రూమ్లోకి చొరబడ్డాడు. బెంచీపై కూర్చున్న ఆ బాలిక వద్దకు వెళ్లి తల, ముఖం, వీపుపై రంపంతో కోసేశాడు. అడ్డుకోబోయిన మరో అమ్మాయికి కూడా గాయాలయ్యాయి. "నేను బోర్డు వైపు తిరిగి పాఠం చెబుతున్నాను.. అప్పుడే ఓ వ్యక్తి లోపలికి వచ్చి దాడి చేశాడు. కళ్లముందు అంత రక్తం చూసి బిత్తరపోయాను, అసలేం జరుగుతుందో తోచలేదు" అంటూ ఆ క్లాస్ టీచర్ భయంతో వణికిపోతూ చెప్పారు. తోటి విద్యార్థులు, టీచర్లు పెద్దగా కేకలు వేయడంతో ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు.
