KTR : 420 హామీలపై సమాధానం చెప్పు రాహుల్ గాంధీ : కేటీఆర్
హైదరాబాద్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ‘అభయహస్తం’లోని హామీల అమలు తీరును ప్రశ్నిస్తూ సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా సంచలన పోస్టు పెట్టారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో హైదరాబాద్లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలపై ప్రజలు అడుగుతున్న సాధారణ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిలదీశారు.గత ఎన్నికల సమయంలో బీసీల సంక్షేమానికి బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, మూడేళ్లలో రూ.5వేల కోట్ల కంటే తక్కువ నిధులే ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ.. ఒక్క శాతం కూడా రాష్ట్రంలో అమలు చేయలేదని ప్రశ్నించారు. పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అంబేద్కర్ అభయహస్తం కింద రూ. 12 లక్షలు అందిస్తామని, అలాగే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు 31 శాతం వాటా కల్పిస్తామని ఇచ్చిన హామీల అమలు ‘సున్నా’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు.
