తక్కువ ధరకే క్వాలిటీ బియ్యం.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
తెలంగాణలో ఎల్నినో ప్రభావం మొదలుకాకముందే బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. కొందరు బియ్యం వ్యాపారులు, డీలర్లు కుమ్మక్కై మార్కెట్లో కొరత సృష్టించి గతంలో రూ.1200 ఉన్న 26 కేజీల బ్యాగును ఇప్పుడు రూ.1800 నుంచి రూ.2500 వరకు విక్రయిస్తున్నారు. పాత స్టాక్ బియ్యపు సంచులకు సైతం కొత్త లేబుల్స్ వేసి లాభాలు దండుకుంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి కనిపించింది. దీంతో రంగంలోకి దిగిన రేవంత్ సర్కార్ బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు నడుం బిగించింది. మార్కెట్లో బియ్యం ధరలను నియంత్రించడంతో పాటు రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. అందుకోసం ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ కిలో బియ్యాన్ని రూ.66, రూ.74, రూ.79 చొప్పున మూడు రకాల ధరలకు విక్రయించేలా ప్లాన్ చేసింది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా మొత్తం 10 విక్రయ కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది.
