తెలంగాణ

డిప్యూటీ సీఎం భట్టికి నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డుకున్న మహిళలు!

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నదాతల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటన కొనసాగించింది. ఇవాళ కూడా ఆయన పర్యటనలో భాగంగా బయలు దేరగా.. ఆయన కాన్వాయ్‌ను కొందరు మహిళలు అడ్డుకున్నట్టు సమాచారం. ఖమ్మం జిల్లా చింతకానిలో ఈ ఘటన జరిగింది. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొందరు దళిత మహిళలు రోడ్డుకు అడ్డంగా వచ్చినట్టు సమాచారం. అదే సమయంలో అటుగా వస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్‌ను వారు అడ్డుకునేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. దళితులకు ఇస్తానని చెప్పిన మూడెకరాల భూమి ఇంకెప్పుడు ఇస్తారని మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన తెలిపినట్టు సమాచారం.