కాలువల్లో తుమ్మచెట్లు.. నా సెల్ఫీనే సజీవసాక్ష్యం : హరీశ్ రావు
రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు.తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గతంలో జళ సిరులతో ప్రవహించిన కాలువలు ఇప్పుడు పడావు పడ్డాయని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వంలో అన్నదాతలు అల్లాడుతున్నారని, ప్రాజెక్టులు పడావు పడ్డాయని ఆరోపించారు. గురువారం నర్సాపూర్ రెడ్డిపల్లి కాలువ పరిసరాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. ఈ సందర్బంగా హరీశ్ రావు బీఆర్ఎస్ నేతలతో కలిసి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘నీళ్లు పారాల్సిన కాలువల్లో తుమ్మ చెట్లు మొలిచాయి. కేసీఆర్ హయాంలో పరుగులు పెట్టిన ప్రాజెక్టులు మీ నిర్లక్ష్యానికి ఇలా పడావు పడ్డాయి. నర్సాపూర్ రెడ్డిపల్లి వద్ద ఆగిపోయిన కాలువ పనుల దగ్గర నేను దిగిన ఈ సెల్ఫీనే.. మీ చేతకాని పాలనకు సజీవ సాక్ష్యం. ఉమ్మడి మెదక్ జిల్లా రైతులంటే మీకెందుకంత కక్ష?’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వం ఎదుట పలు డిమాండ్లను హరీశ్ రావు ఉంచారు.
